తెలంగాణకు మరో మూడు దిగ్గజ సంస్థలు:కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు మరో మూడు దిగ్గజ సంస్థలు:కేటీఆర్

March 23, 2022

10

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సంస్థలతో మంగళవారం కేటీఆర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేందుకు ఆయా సంస్థలను ఒప్పించారు. దీంతో మరో 3 సంస్థలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..”అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ గోల్ఫ్‌ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘కాల్‌ అవే గోల్ఫ్‌’ అమెరికా తర్వాత అతి పెద్దదైన డిజిటల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. మరోవైపు ప్రముఖ విద్యుత్‌ వాహనాల సంస్థ ఫిస్కర్‌ ఐఎన్‌సీ తెలంగాణలో రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 300 మందికి ఉపాధి లభించనుంది. ఈ కేంద్రం ద్వారా ఏడాదిలోగా కార్యకలాపాలను ప్రారంభించనుంది. సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, సెమీ కండక్టర్‌ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజం క్వాల్కమ్‌ సంస్థ రూ.3,904.55 కోట్లతో ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో వచ్చే అక్టోబర్‌లో ప్రారంభించనుంది” అని ఆయన వెల్లడించారు.

ఇక, కాల్‌అవే సంస్థ గోల్ఫ్‌ బంతులు, స్టిక్స్, దుస్తులు, ఇతర సామగ్రిని ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తోంది. రూ.24 వేల కోట్ల వార్షికాదాయం, 2400 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ భారత్‌లో డిజిటెక్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. కాలిఫోర్నియా సమీపంలోని కాల్‌అవే ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికాధికారి బ్రయన్‌ లించ్‌, సీఐవో సాయి కూరపాటిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారు.