ఛత్తీస్‌గడ్‌లో కరోనా కలకలం.. ఆరు పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఛత్తీస్‌గడ్‌లో కరోనా కలకలం.. ఆరు పాజిటివ్ కేసులు

March 26, 2020

Three new coronavirus cases takes Chhattisgarh tally to six.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా దేశంలో కరోనా మెల్లగా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కొన్ని కొత్త కేసులు వివిధ రాష్ట్రల్లో నమోదు అవుతున్నాయి.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) డైరెక్టర్ ఎన్ఎం నంగార్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిలాస్‌పూర్‌కు చెందిన ఓ మహిళకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అంతకుముందు బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో రాయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు, రాజ్‌నందగావ్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. గత వారం, లండన్ నుంచి రాయ్‌పూర్‌కు తిరిగి వచ్చిన 24 ఏళ్ల మహిళతోనే రాష్ట్రంలో కరోనావైరస్ మొదటి కేసు నమోదు అయిందని పేర్కొన్నారు.

ఆరుగురిలో నలుగురిని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించగా, మరో ఇద్దరు ఆయా  ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వీరంతా నిరంతర వైద్య పరిశీలనలో ఉన్నారని అన్నారు. ఇదిలావుండగా, మార్చి 20న భోపాల్‌లో జరిగిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన జర్నలిస్టులను స్వీయ నిర్బంధంలో ఉండాలని, వెంటనే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని రాష్ట్ర ప్రజా సంబంధాల శాఖ కోరింది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న భోపాల్‌కు చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయంత తీసుకున్నట్టు స్పష్టంచేసింది. కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య 649కి చేరింది. వారిలో 43 మంది పూర్తిగా వైరస్ నుంచి కోలుకోగా.. మరో 13 మంది మృతిచెందారు. మరో 593 మంది వివిధ రాష్ట్రాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.