ప్రభుత్వాసుపత్రిలో ఘోరం.. కరెంట్ లేక ఐదుగురు మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వాసుపత్రిలో ఘోరం.. కరెంట్ లేక ఐదుగురు మృతి..

May 8, 2019

ప్రభుత్వ ఆస్పత్రుల తీరు నానాటికీ దిగజారుతోంది. ఎన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ వాటి తీరుతెన్నల్లో మార్పు కనిపించడంలేదు. అలాంటిదే మరో ఘోరం తమిళనాడులోని మధురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రిలో కరెంటు లేక వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతిచెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Three patients die in Madurai Government Rajaji Hospital during power failure, relatives allege negligence

మధురైలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో మధురైలోని ప్రభుత్వాసుపత్రిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో పనిచేసే అన్ని విద్యుత్ పరికరాలు రెండున్నర గంటలపాటు ఆగిపోయాయి. వెంటిలేటర్లు కూడా పనిచేయలేదు. దీంతో వాటిపై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది.

దీంతో మరణించిన వారి బంధువులు దాదాపు 100 మంది ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలో ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్లు పెట్టాలికదా అని ప్రశ్నించారు. అయితే ఆస్పత్రిలో చనిపోయినవారివి సహజ మరణాలేనని, వారు వెంటిలేటర్ వైఫల్యం వల్ల మరణించలేదని ఆస్పత్రి డీన్ వనితా మణి కొట్టిపడేశారు. దీంతో రోగి బంధువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.