ఛతీస్‌గఢ్‌లో సుక్మా జిల్లా అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం జాగరకుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుపడడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఏఎస్సై రామురాం సింగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్స్ కుంజమ్ జోగా, వంజం భీమాగా తెలుస్తోంది. ఉదయం డీఆర్‌జీ బృందాలు సుక్మా జిల్లా జాగర్ గుండ పోలీస్ స్టేషన్ నుంచి నక్సల్స్ పెట్రోలింగ్ కోసం వెళ్ళగా మధ్యలో మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు అనంతరం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతోంది. విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.