త్రీ బ్రదర్స్ సముద్రాన్ని గెలిచారు.. ఏకంగా 3వేల మైళ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

త్రీ బ్రదర్స్ సముద్రాన్ని గెలిచారు.. ఏకంగా 3వేల మైళ్లు..

January 17, 2020

Three Scottish brothers.

ముగ్గురు మొనగాళ్లు, ముగ్గురు మరాఠీలు గట్రా  సినిమాల్లోని హీరోలు నిజానికి ఎలాంటి సాహసాలూ చేయరు. కానీ ఈ ముగ్గురు అలాంటి సాహసాలను నిజ్జంగా, నిర్భయంగా చేస్తారు. అట్లాంటిక్‌ సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన రూట్లో వీరు తాజాగా పెద్ద  సాహసం చేశారు. ముగ్గురు సోదరులైన ఎవాన్‌ (27), జమీ (26), లచ్లాన్‌ (21)లు కలిసి డిసెంబర్‌ 12వ తేదీన తమ ప్రయాణం ప్రారంభించారు. దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువైన 28 అడుగుల రోయింగ్‌ (తెడ్లతో నడిపే) పడవలో అట్లాంటిక్‌ సముద్రంలో కానరీ దీవుల్లోని లా గొమెరా నుంచి మూడు వేల మైళ్ల దూరంలోని కరీబియన్‌లోని ఆంటిగ్వా నెల్సన్స్‌ హార్బర్‌కు గురువారం చేరుకున్నారు. 35 రోజుల, తొమ్మిది గంటల, తొమ్మిది నిమిషాలు వారు తమ గమ్యానికి చేరడానికి పట్టిన సమయం. ముగ్గురు సోదరులకు ప్రయాణంలో ‘సీ సిక్‌నెస్‌’ వచ్చింది. ఒంటి నిండా కురుపులు, దద్దులు లేచాయి. 

వాటికి ఎప్పటికప్పుడు యాంటీ బయాటిక్స్‌ పూసుకుంటూ, నిద్ర మరిచిపోయి వారు ఈ సాహసాన్ని పూర్తి చేశారు. ఇదంతా ఒకెత్తు అయితే ఆ సముద్రంలో జలాలు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసి పడుతుంటాయి. తుపాన్లు తరచుగా వస్తుంటాయి. పెద్ద పెద్ద సొరచేపలు రక్తమాంసాల కోసం ఆబగా ఎదురుచూస్తుంటాయి. ఇన్నేసి ప్రమాదాలను దాటి వారు సాహసం చేయడం వెనుకు మంచి ఉద్దేశం ఉంది. ప్రపంచంలోని దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ‘ఫీడ్‌బ్యాక్‌ మడగాస్కర్‌’తో పాటు ‘చిల్డ్రన్‌ ఫస్ట్‌’ చారిటీ సంస్థకు రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్జించేందుకు వారు ఈ కొత్త సాహస ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ ముగ్గురు మొనగాళ్లు చాలా చాలా గ్రేట్ కదా.