శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ భక్తి పారవశ్యంలో మునుగుతుంటే ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని పోలవరం మండలం పట్టిసీమ వద్ద శివరాత్రి వేడుకలు చూసేందుకు వచ్చిన ముగ్గురు యువకులు పుణ్యస్థానాలు చేసేందుకు గోదాట్లో దిగగా ఆ నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరు ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు స్పందించి గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. వారు ఎంత గాలించినా యువకులు ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.