ఒకేసారి ముగ్గురు, నలుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది కవలలు పుట్టడం చూశాం. కానీ, ఆ పుట్టినవారికి ఒకేసారి పెళ్లి జరగడం మాత్రం చూడలేదు కదూ. కాస్త వెనకాముందు పెళ్లిళ్లు అవుతుంటాయి. అయితే కేరళలో ఒకే వేదికపై ఏకంగా ముగ్గురు కవలలకు ఒకే సమయంలో వివాహం జరిగింది. ముగ్గురి వయసు ఇప్పుడు పాతికేళ్లు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళ 1995 నవంబర్ 18న ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారిలో ఒక మగపిల్లవాడు కాగా, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో తల్లిదండ్రల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తమ పిల్లలకు ముద్దుగా ఉత్తర, ఉత్తమ, ఉత్ర, ఉత్రజా, ఉత్రజన్ అనే పేర్లు పెట్టుకున్నారు. ఒకేసారి ఐదుగురు పుట్టడంతో మీడియాలో కూడా వారి గురించి వార్తలు వచ్చాయి. అయితే రమాదేవి భర్త అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో ఐదుగురి పిల్లల బాధ్యత రమాదేవి మీద పడింది. అయినా ఆమె తన పిల్లల కోసం ఎంతో కష్టపడి మంచి విద్యాబుద్ధులు చెప్పి పెద్దచేసింది.
అలా అందరూ ఒకేసారి పెరిగి పెద్దవారు అయ్యారు. ఈ క్రమంలో వారికి పెళ్లిళ్లు చేయాలని రమాదేవి భావించారు. ఈ క్రమంలో తాజాగా ఆ నలుగురు కవల యువతుల్లో ముగ్గురికి ఒకే వేదికపై వివాహం జరిగింది. నలుగురు యువతులకు ఒకేసారి నిశ్చితార్థం జరిగింది. అయితే ఒక యువతిని చేసుకోబోయే వరుడు కువైట్ నుంచి సమయానికి రాకపోవడంతో ముగ్గురి వివాహమే జరిగింది. లేదంటే నలుగురి వివాహం ఒకేసారి జరిగేది. కాగా, తన ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు జరగడంతో తల్లి రమాదేవి ఎంతో సంతోషపడుతోంది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, పిల్లలను కష్టపడి పెంచానని రమాదేవి తెలిపింది. పిల్లలు బాగా చదువుకున్నారని.. అందరికి ఉద్యోగాలు వచ్చాయని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.