The thug who asked for a lift and gave an injection and killed in khammam Dist
mictv telugu

ఖమ్మం జిల్లాలో దారుణం.. లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు

September 19, 2022

మానవత్వంతో సాటి మనిషికి సాయం చేద్దామనుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌ను ఆపి లిఫ్ట్‌ అడిగిన దుండగుడు.. కొంతదూరం వెళ్లాక వాహనదారుడికి ఇంజెక్షన్‌ ఇచ్చాడు. అనంతరం వాహనదారుడు స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే.. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (40).. వల్లభిలో చిన్న కూతురు వద్దనున్న తన భార్యను తీసుకొచ్చేందుకు తన ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. వల్లభి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి జమాల్‌ను లిఫ్ట్‌ అడిగాడు. దీంతో జమాల్‌ అతడ్ని తన వాహనంపై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లగానే దుండగుడు తనకు ఓ ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆయన తన బైక్ ఆపగానే నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని జమాల్‌ తన భార్యకు ఫోన్‌లో తెలిపారు. అనంతరం ఆయన స్పృహ కోల్పోవడంతో అటుగా వచ్చిన వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే జమాల్‌ మృతిచెందారు. ఘటనాస్థలంలో ఇంజెక్షన్‌, సిరంజీ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు.