ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఉరుములు, పిడుగులతో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు వణికిపోయారు. యూపీలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ ఆదివారం పలు చోట్ల పిడుగులు పడటంతో ఏకంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకృతి వైపరీత్యాల సాయం కింద రూ. 4 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో శనివారం సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభం అయ్యాయి. భయంకరమైన శబ్ధం చేస్తూ పిడుగులు పడ్డాయి. అత్యధికంగా ఉన్నవ్ లో 8 మంది, కన్నౌజ్ లో ఐదుగురు మరణించారు. లక్నో నగరంలో ఓ ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంబాలు పడిపోవడంతో కరెంట్ లేక జనం అవస్థలు పడ్డారు. బహువా గాలికి ఇళ్లు కూలిపోయి 55 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ విలయంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సీఎం ఆదిత్యానాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.