కాకినాడ నుంచి అనకాపల్లికి రూటు మార్చిన పెద్దపులి
ఇన్నాళ్లూ కాకినాడ జిల్లా వాసులను భయపెట్టిన పెద్దపులి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు తరలివెళ్లింది. ఆ జిల్లాలోని నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. తటపర్తి వద్ద గేదెపై పులి దాడి చేసింది.
దీంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని సమీపంలోని కుమ్మరిలోవ పరిధిలోని కుచ్చులకొండ వైపు పులి సంచరించినట్టు సమాచారం. తాండవ నదీ పరివాహక ప్రాంతానికి వెళ్తున్న పులి తుని - కొట్టాం రహదారిపై కాసేపు ఆగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రయాణించే బస్సు లైట్ల వెలుతురును కాసేపు చూసిన పులి.. ఇటువైపున్న తాండవ నదిని దాటలేక కుచ్చులకొండపైకి వెళ్లిపోయిందని వెల్లడించారు.