స్మగ్లింగ్‌కు కాదేదీ అనర్హం. చివరికి పులిపిల్ల కూడా. మెక్సికోలో రెండు నెలల వయసున్న బుజ్జి పులి పిల్లను కొందరు అక్రమార్కులు ప్లాస్టిక్ డబ్బాలో కుక్కేసి కొరియర్లో పంపారు. అయితే ఓ పోలీసు జాగిలం వాసన పసిగట్టడంతో గుట్టురట్టయి. ఈ ఉదంతం మెక్సికోలోని జాలిస్కోలో జరిగింది.
స్మగ్లర్లు పులిపిల్లను ప్యాక్ చేసి దానికి కాస్త ఊపిరి ఆడేందుకు డబ్బాకు రంధ్రాలు పెట్టారు. డబ్బాను క్వెరెటారో దేశానికి ఎక్స్‌ప్రెస్ మెయిల్ ద్వారా పంపేందుకు బుక్ చేశారు. జాలిస్కోలోని న్యూ ట్లాక్యుపాక్యు సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన తనిఖీలకు అదీ వచ్చింది. పోలీస్ జాగిలం కొరియర్లో ఏదో జంతువు వున్నట్లు పసిగట్టి భౌభౌ అని అరిచేసింది. సిబ్బంది కొరియర్ తెరిచి చూడడంతో పులిపిల్ల బిక్కుబిక్కుమంటూ చూసింది.
ఆహారం, నీరు లేక బాగా నీరసించి ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.