Tiger Shroff-Rashmika movie has been shelved
mictv telugu

బాలీవుడ్‌లో ఆగిపోయిన రష్మిక చిత్రం.. అత్యాశే కారణం!

August 29, 2022

శాండల్ వుడ్, టాలీవుడ్‌లలో స్టార్‌గా ఎదిగిన నేషనల్ క్రష్ రష్మిక తన తర్వాతి అడుగు బాలీవుడ్‌లో పెట్టింది. అక్కడ కూడా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. పుష్ప హిట్ కావడంతో నార్త్‌లో రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అవకాశాలతో క్యూ కడుతున్నాయి. రష్మిక కూడా ఏ ప్రాజెక్టుకీ నో చెప్పకుండా కాల్షీట్లు సర్దుబాటు చేసుకుంటూ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. రష్మిక హీరోయిన్ కాగా, ఆమె కూడా చిత్రంపై సంతకం చేసింది. ‘స్క్రూ ఢీలా’ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రంపై హీరోహీరోయిన్ల ప్రకటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

ఇందుకు కారణం చిత్ర హీరో టైగర్ ష్రాఫ్ రెమ్యూనరేషన్ అని బాలీవుడ్ టాక్. ఒక్కో చిత్రానికి టైగర్ రూ. 35 కోట్లు తీసుకుంటాడు. ఆ మేరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశాడు. అయితే పారితోషికాన్ని తగ్గించుకోవాలని, రూ. 20 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా ఇస్తానని కరణ్ కోరగా, టైగర్ తిరస్కరించాడు. ప్రస్తుత బాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే లాభాలు వచ్చే అవకాశాలు తక్కువని, అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇస్తేనే సినిమా చేస్తానని పట్టుబట్టడంతో సినిమా అటకెక్కిందని వినికిడి. నటీనటుల పారితోషికాలు కలుపుకుంటే బడ్జెట్ రూ. 140 కోట్లు దాటుతోంది. పైగా ప్రమోషన్లకు అదనం. అటు కరణ్ జోహార్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన లైగర్ చిత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో రష్మిక తప్ప మిగతా వారు కలిసి ఈ సినిమాను ఆపేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో రష్మిక బాలీవుడ్‌లో ఓ సినిమా కోల్పోయినట్టయింది.