ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి.. అసెంబ్లీలో డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి.. అసెంబ్లీలో డిమాండ్

February 5, 2020

‘మనుషులు ఆవులను తింటే శిక్షిస్తున్నారు. మరి మనుషుల్లాగే పులులు కూడా ఆవులను తినేస్తున్నాయిగా. మనుషులను శిక్షిస్తున్నట్లే వాటిని కూడా శిక్షించాలి’ అని ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో గొంతెత్తాడు. పులి ఆవులను తినడం సహజధర్మమని కొందరు ఎమ్మెల్యేలు నచ్చచెప్పినా పట్టించుకోకుండా వాదన వేసుకున్నాడు. గోవా అసెంబ్లీలో బుధవారం ఈ ఆసక్తికర వాగ్వాదం జరిగింది. 

ఇటీవల మహదాయి అడవుల్లో ఓ పులి ఓ ఇంట్లోకి దూరి ఆవును చంపేసింది. స్థానికులు దానిపై దాడి చేశారు. కర్రలతో కొట్టడంతో పులి, దాని మూడు పిల్లలు చనిపోయాయి. ఈ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. దీనిపై సభలో సావధాన తీర్మానం తేవాలని విపక్ష నేత దింగంబర్ కామత్ డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో స్పందిస్తూ.. ‘మనిషి ఆవును తింటే శిక్షిస్తున్నారు. మరి పులి కూడా మనిషిలా ఆవును తింటే ఏ శిక్ష వేస్తారు? వన్యప్రాణులకు సంబంధించి పులి ముఖ్యమైనట్లే. మనుషులకు సంబంధించి ఆవు కూడా ముఖ్యమైందే. ఇందులో మనిషి కోణాన్ని విస్మరించకూడదు.. ’ అని అన్నారు. సీఎం ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. పులి దాడిలో పశువులను పోగొట్టున్న రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.