మనుషులు పెద్దపులులతో ఆడుకోవడం వింతేమీ కాదు. జూలలో పులులు మచ్చికై ఉంటాయి కాబట్టి వాటి సంరక్షకులే కాకుండా సందర్శకులు కూడా నానా పోజులు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. కానీ అడవుల్లోని పులులతో అది సాధ్యం కాదు. పైగా పసికూనలను వెంటేసుకుని తిరిగే ఆడపులితో పెట్టుకుంటే సీన్ మామూలుగా ఉండదు. మటన్ మసాలై ప్రాణాలు లేచిపోతాయి. కానీ వాటిలోనూ జాలి, దయా ఉంటాయని రుజువైంది. తమను వేటాడి చంపుతున్న మనుషుల పట్ల ఆ క్రూరమృగాలకు పగేమీ ఉండదని, తమ మానాన తమను వదిలేస్తే చాలనుకుంటాయని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
@Panna tiger reserve…tigress with their cubs … beautiful pic pic.twitter.com/lkg5R1QizE
— Kaushal K Chaturvedi (@Chaturvedikk17) February 10, 2023
మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వులో కనిపించిదీ దృశ్యం. నాలుగు పిల్లలు ఉన్న పెద్దపులి అడవిలో తిరుగుతూ కల్వర్టు దగ్గరికి వచ్చింది. అదే సమయంలో దాన్ని చూడ్డానికి దారికి అటూ ఇటూ వాహనాలు ఆగి ఉన్నాయి. పులిని చూడ్డానికి జనం కళ్లు, నోళ్లు బాగా తెరుచుకుని ఎగబడ్డారు. కేవలం కొన్ని అడుగుల దూరంలో పులి తిరిగింది.
అది తమకు రెండు అడుగుల దూరంలోనే ఉన్నా జనం ఏమాత్రం భయపడకుండా సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. కల్వర్టుకు అటువైపు నీరు ఉండడంతో పులి అటువెళ్లలేక మళ్లీ వచ్చిదారినే వెళ్లిపోయింది. తనను, తన పిల్లలను అంతదగ్గర్నుంచి వీడియో తీస్తున్నా దాడి కాదు కదా కనీసం గర్జించను కూడా గర్జించకుండా వెళ్లిపోవడం విశేషం.