ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టుకు తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో కాస్త ఉపశమనం కలిగించాడు. ఒక పక్క సహచరులు ఆడలేక చేతులెత్తేస్తే..సౌథీమాత్రం ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 పరుగులు చేసి న్యూజిలాండ్ పరువును కాపాడాడు. ఈ క్రమంలోనే ధోని రికార్డును కూడా సౌథీ బద్దలగొట్టాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో11వ స్థానానికి సౌథీ ఎగబాకాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 6 సిక్సర్లు బాది టెస్ట్ ల్లో 82 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 78 సిక్స్‌లతో ఉన్న ధోనిని అధిగమించాడు. ధోనియే కాకుండా సచిన్ టెండూల్కర్ (69), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (68), భారత మాజీ సారథి కపిల్ దేవ్ (61)ను కూడా సౌథీ వెనకే ఉన్నారు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(109) మొదటి స్థానంలో ఉన్నాడు.
సిక్సర్ల రికార్డే కాకుండా ఇదే మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సౌథీ తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ జట్టుపై తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక మ్యాచ్ విషాయనికొస్తే ఫాల్ఆన్ కారణంగా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు రాణిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి కివీస్ 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 23 పరుగులు, హెన్రీ నికోలస్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఒపెనర్లు టామ్ లాథమ్ 83, కాన్వే 61 పరుగులతో రాణించారు. మొదటి వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటయ్యారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ సౌతీ 73 పరుగులతో ఆదుకున్నాడు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 435 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.