కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం: బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం: బండి సంజయ్

March 24, 2022

14

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని.. బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రజలు అనేక అవస్థలకు గురై, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే కేసీఆర్ సర్కార్ ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంచి మోయలేని భారాన్ని మోపిందని అన్నారు. ఈ సందర్భంగా గురువారం బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

”రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణం. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం.. ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. డిస్కంలకు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా, అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12,598 కోట్లు ఉన్నాయి. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4603 కోట్లు కాగా, అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే” అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించడం లేదు. మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు. కానీ సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు కరెక్ట్ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. క‌రెంట్ ఛార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క‌రెంటు ఛార్జీల పెంపుపై ఆందోళ‌న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.