tips for saree wraping, beauty, saree, wrap, tips, dresses, woman
mictv telugu

సొగసు చూడతరమా…చీరలో నీ సొగసు చూడ తరమా

February 28, 2023

tips for saree wraping, beauty

భారతీయ మహిళలకు అత్యంత ఇష్టమైన దుస్తుల్లో చీర ఒకటి. 16 అణాల తెలుగు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసేది ఆరు గజాల చీర మాత్రమే. ఎన్ని డ్రెస్సులు వచ్చినా చీరకు సాటిలేదంటారు.మగవారు ఆడవాళ్ళను చూడ్డానికి ఇష్టపడేది కూడా చీరల్లోనే.పూర్వ కాలంలో చీర తప్ప ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఇంటా బయటా కూడా చీరే కట్టుకునే వారు. కానీ ఇప్పుడలా కాదు. బోలెడు వెరైటీలు. చీరకంటే కంఫర్ట్ ఉండే దుస్తులు వచ్చేశాయి. పైగా డ్రస్ వేసుకుంటే సరిపోతుంది. అదే చీర అయితే కట్టుకోవాలి. అదోపెద్ద పని. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకు తప్ప చీర కట్టుకోవడానికి మహిళలు ఇష్టపడటం లేదు. అంటే చీర అంటే వారికి ఇష్టం లేక కాదు.. కానీ దానిని కట్టుకోవడం కష్టతరం అని భావించడం వల్ల మాత్రమే.

మహిళలు చీర కట్టుకునే సమయంలో వారు పడే తిప్పలు అంతా.. ఇంతా కాదు.ఈ రోజుల్లో ఏ పని నేర్చుకోవాలన్నా మనకు అందుబాటులో ఇంటర్నెట్ ఉంది. దీంతో ఏ పని గురించి కావాలన్నా సులభంగా నేర్చుకోవచ్చు. చీర ఎలా కట్టుకోవాలి, ఎలా చుట్టుకోవాలి, కుచ్చిళ్ళు ఎలా సెట్ చేసుకోవాలి, చీర జారిపోకుండా… ఎక్కడెక్కడ ఎలా పిన్నులు పెట్టుకోవాలి ఇలా అన్నింటి గురించి వీడియోలతో సహా ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయి.

చీర కట్టుకోవడానికి మొదటి మెట్టు దాన్ని ఎంచుకోవడం. చీర ఎంపికలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఫ్యాబ్రిక్. శరీరతత్వానికి సరిపోయేలా పట్టు, జార్జెట్.. వంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకుంటే మంచిది. వీటిని ఎంచుకోవడం వల్ల ఒకసారి చీర కట్టుకున్నాక అది జారిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. ఇవి సాఫ్ట్ మెటీరియల్స్ కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు. చక్కగా పిన్స్ పెట్టి కట్టుకుంటే చాలు.. అలా నిలిచిపోతాయి. అదే శాటిన్ క్లాత్ అయితే చీర జారుతూ ఉంటుంది. కాటన్ క్లాత్ స్టిఫ్‌గా ఉండిపోయి ఇబ్బంది పెడుతుంది. వీటిని కట్టుకోవద్దని కాదు. కానీ మొదటిసారి కట్టుకునేవాళ్ళు వీటికి దూరంగా ఉంటే మంచిది. అందులోనూ భారీ అంచులు, ఆకర్షణీయమైన చీరల జోలికి వెళ్ళకుంటే మరీ మంచిది.

తర్వాత ముఖ్యమైన పని ఏంటంటే.. చీరను ముందుగా మడతపెట్టడం. కొంతమంది మహిళలకు ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఇది ఒక సులభమైన చిట్కా. చీరను ముందుగా ఒకసారి నడుం చుట్టూ తిప్పి దానిని పిన్‌తో కదలకుండా ఉంచుకోవాలి. తర్వాత మీ నడుము చుట్టుకొలతను అంచనా వేసి చీరను సమాన మడతలుగా విభజించాలి. ఇప్పుడు అన్ని మడతలను కలిపి బొడ్డు కింద దోపుకోవాలి. ఇప్పుడు మరో సగం నడుంచుట్టూ తిప్పి రెండో చివర పమిటచెంగు ఎడమ భుజం మీద నుంచి వెనుకకు వదిలేయాలి.

చీరకు ఎవరైనా పిన్స్ పెడతారు. ఎందుకంటే చీర పదేపదే జారుతుంది. చీర కట్టుకోవడం మొదటిసారి కాబట్టి.. ఎక్కడా ఇబ్బంది లేకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. కుచ్చిళ్ళు పెట్టే ముందు ఒక పిన్ పెట్టండి. ఇలా పెట్టికోట్‌కి చీరకి కలిపి పిన్ పెట్టడం వల్ల.. మీరు కుచ్చిళ్ళు దోపిన తర్వాత కూడా అవి కదలకుండా ఉంటాయి. కుచ్చిళ్ళు పెట్టాక వాటిని కలుపుతూ ఓ పిన్ పెట్టుకొని అప్పుడు లోపలికి దోపుకోండి. ఆ తర్వాత చీర కొంగు కోసం మరొక పిన్ పెట్టుకోవాలి. ఇంకా మీకు ఎక్కడైనా చీర జారుతుందని అనుమానంగా అనిపిస్తే.. అక్కడ కూడా పిన్ పెట్టుకోవచ్చు.

చీర కట్టుకున్నప్పుడు తప్పకుండా నడుము కొంత భాగం బయటకు కనిపిస్తుంది. మీరు ఎంత భాగం బయటకు చూపించడానికి ఇష్టపడుతున్నారు అన్నదానిపై ఆధారపడి కూడా చీర ఎంపిక ఉండాలి. షీర్ ఫ్యాబ్రిక్స్, నెట్టెడ్.. వంటివి ఎంచుకున్నప్పుడు చర్మం ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే.. వీటి బదులు వేరే ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. అంతేకాకుండా.. బ్లౌజ్ పొడవు కూడా చూసుకొని కుట్టించుకోవాలి.

డ్రెస్ లు కాస్త లూజ్‌గా వేసుకునే అలవాటు ఉండవచ్చు. కానీ చీర కట్టుకునేటప్పుడు మాత్రం పెట్టికోట్ టైట్‌గా కట్టుకోవాల్సి ఉంటుంది. అలా టైట్ కట్టుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ కాసేపటికి అది వదులయిపోతుంది. చీర కట్టుకున్నాక మీకు ఇబ్బంది తెలీదు. కాబట్టి పెట్టికోట్‌ని కాస్త టైట్‌గానే ఉంచుకోవాలి. పెట్టికోట్ ఇలా టైట్‌గా ఉంటే చీర చక్కగా కనిపిస్తుంది. ఇక్కడే చాలామంది అమ్మాయిలు తప్పు చేస్తుంటారు. పెట్టికోట్‌ని లూజ్‌గా బొడ్డు కిందకు కడుతుంటారు. కానీ ఇలా కట్టడం వల్ల చీర జారుతుంది. కాబట్టి పెట్టికోట్‌ని మీదకు కట్టుకొని కాస్త టైట్‌గా ఉంచుకుంటే చాలు.. చీర జారకుండా ఉంటుంది.

చీర కట్టుకున్నప్పుడు చాలామంది హై హీల్స్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పెద్దగా ఇబ్బంది కలిగించని వెడ్జెస్, కిట్టెన్ హీల్స్ వంటివి వేసుకోవచ్చు. లేదంటే చీర కట్టుకొని నడిచేటప్పుడు ఇబ్బంది ఫీలవుతారు. హీల్స్ మరింత ఇబ్బందిని కలిగించకుండా ఉండాలంటే నడవడానికి వీలుగా ఉండేవి ఎంచుకోవాలి. అలాగే పెట్టికోట్ కట్టుకున్నాక.. చీర దోపేటప్పుడు చెప్పుల ఎత్తును కూడా పరిగణనలోకి తీసుకొని కాస్త కిందికి లేదా పైకి దోపుకోవాలి.