Tiranga Yatra in Old city on September 17 : Owaisi
mictv telugu

సెప్టెంబర్ 17పై కొత్త ప్రతిపాదన చేసిన ఓవైసీ

September 3, 2022

Tiranga Yatra in Old city on September 17 : Owaisi

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మునుగోడు ఉప ఎన్నికతో పాటు సెప్టెంబర్ 17 చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఆ రోజు జరిపే వేడుకుల గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపనుండగా, టీఆర్ఎస్ తెలంగాణ విలీన దినోత్సవం జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ కూడా భారీగా వేడుకలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. శనివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలా కాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రతా దినోత్సవంగా జరపాలని కోరారు. ఈ మేరకు అమిత్ షా, కేసీఆర్‌లకు లేఖలు రాశానని చెప్పారు. తెలంగాణ విమోచనం కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని, తుర్రేబాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆ రోజు పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామని, పార్టీ నేతృత్వంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ రకంగా పార్టీలు పోటాపోటీగా యాత్రలు, సభలు నిర్వహిస్తుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.