Tirumala Actress Archana Raccha Raccha ..Detailed by TTD
mictv telugu

తిరుమలలో అర్చన రచ్చ రచ్చ..క్లారిటీ ఇచ్చిన టీటీడీ

September 6, 2022

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటి అర్చన గౌతమ్..నిన్న రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. సోమవారం తిరుపతి దర్శనానికి వచ్చిన ఆమె..రూ.10,500 పెట్టి, టికెట్ కొన్న కూడా టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వలేదని, కౌంటర్‌కి వెళ్లి ప్రశ్నించగా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. ఆ సమయంలో టీటీడీ సిబ్బంది ఎలా ప్రవర్తించారో చెప్తూ, ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. ”మా సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధం. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య. అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తుంది. శివకాంత్ తివారీ, నటి అర్చనా గౌతమ్‌తోపాటు మరో ఏడుగురు ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయ మంత్రి నుంచి సిఫార్సు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ లేఖపై రూ.300 దర్శన టికెట్లు మంజూరు చేస్తూ, శివకాంత్ తివారీకి చెందిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాం. కానీ, ఆ అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు.

 

ఆ తర్వాత శివకాంత్ తివారీ అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసిందని సిబ్బంది తెలిపారు. ఆయనతోపాటు అదనపు ఈవో కార్యాలయంలోకి వచ్చిన నటి అర్చనా గౌతమ్ కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారు. సర్టి చెప్పబోయిన ఒక ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. చివరకు సిబ్బంది వారి వివరాలను తీసుకుని రెండోసారి రూ.300 టికెట్లు కేటాయించినా తీసుకోవడానికి నటి నిరాకరించారు. అక్కడి నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అర్చన.. టీటీడీ కార్యాలయ ఉద్యోగులు తనపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ఫిర్యాదు చేశారు” అని టీటీడీ అధికారులు తెలిపారు.