తిరుపతిలో యువకుడి నిలువు దోపీడీ..
తిరుమలకు వెళితే వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తామంటూ మొక్కుకుంటారు. ఇలా చేస్తే పుణ్యం వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఎంతో కాలంగా ఇది ఓ ఆనవాయితీగా మారింది. కానీ తాజాగా ఓ వ్యక్తి శ్రీవారి సాక్షిగా దొంగల చేతిలో నిలుపుదోపిడీకి గురయ్యాడు. అమ్మాయిని చూసి కక్కుర్తి పడటమే ఇందుకు కారణం. ఉన్నకాడికి ఊడ్చుకెళ్లడంతో ఒంటిపై దుస్తులు కూడా లేకుండా నగ్నంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కడప జిల్లా రాయచోటికి చెందిన రవి అనే యువకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి బస్టాండ్‌లో బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువతి వలపు వల విసిరింది. ఆమెను చూసి కక్కుర్తిపడిన రవి.. పక్కకు రమ్మంటూ యువతి సైగా చేయగానే వెళ్లిపోయాడు. వెంటనే మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతని వద్ద ఉన్న నగదు, ఫోన్,వాచ్, ఒంటిపై ఉన్న దుస్తువులతో పాటు ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. చేసేదేమి లేక నగ్నంగా రోడ్డుపైకి రావడంతో ఆర్టీసీ సెక్యూరిటీ అతన్ని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
అమ్మాయిని ఎరగా వేసి కొంత మంది కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. బాధితుని వద్ద నుంచి సుమారు రూ. 18 వేల నగదు, సెల్‌ఫోన్, వాచ్, దుస్తుల బ్యాగు ఎత్తుకెళ్లినట్టు వెల్లడించారు. అమ్మాయిని చూసి కక్కుర్తి పడటం వల్లే ఇలా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది తెలిసిన వారంతా పుణ్యక్షేత్రంలో పాడుపనికి తగిన శాస్తి జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తెలియనివారితో జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని మరికొంత మంది సూచిస్తున్నారు.