శ్రీవారి వెండి కిరీటం, బంగారు ఉంగరాలు మాయం
తిరుమల శ్రీనివాసుడి ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు ఉండటంతో ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడిగా తేల్చి అతనిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన జీతం నుంచి ప్రతి నెలా డబ్బులు రికవరీ చేశారు. అయితే టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆభరణాలు ఎవరు తీశారో తేల్చకుండా కేవలం ఒక అధికారిని మాత్రమే బాధ్యుడిని చేసి రికవరీ చేస్తే సరిపోదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా టీటీడీ అధికారుల తీరు తరుచు వివాదాలకు దారి తీస్తోంది. గతంలోనూ బంగారం తరలింపు విషయంలో వివాదం చెలరేగింది. ముందు జాగ్రత్త చర్యలు లేకుండా బంగారం తరలించవద్దని సీఎస్ చెప్పడంతో అప్పుడు వివాదం సద్దుమణిగింది. చాలాసార్లు ఆభరణాలు మాయమౌతున్నాయని ఆరోపణలు వస్తున్నా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదని భక్తులు మండిపడుతున్నారు.