తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కలియుగై దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువుదీరిన తిరుమల కొండపై స్వచ్ఛందంగా స్వామివారికి సేవ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది . 2000లో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చిన దేవస్థానం అధికారులు, శ్రీవారి సేవకుల పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా వేసవిలో స్వామివారి సేవ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ శ్రీవారి సేవకుల కోటాను విడుదల చేసింది. సేవకులుగా చేరాలనుకునే వారికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసక్తిగల భక్తులు ఆన్లైన్ లో తమ పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. శ్రీవారి సేవకులుగా ఎంపికైన వారిని విదేశీ భక్తుల రద్దీని నియంత్రించేందుకు, హుండీ లెక్కింపు ప్రాంతాల్లో సేవలు అందించేందుకు వినియోగించుకుంటారు. అంతే కాదు వీరికి వారం రోజుల పాటు వెంకన్న సన్నిద్ధిలో ఉండే మహాద్భుతమైన అవకాశం కల్పిస్తుంది.
పది మంది సేవకులను ఒక్కో బృందంగా ఎంపిక చేస్తుంది టీటీడీ. ప్రతి ఒక్కరు తమ పూర్తి వివరాలను టీటీడీకి అందించాల్సి ఉంటుంది. ఈ సేవలకు కులాలతో పనిలేదు. ఏ కులం వారైనా అర్హులే. కానీ సేవలో పాల్గొనే వారు తప్పనిసరిగా తిలకం బొట్టు పెట్టుకోవాలి. 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ సేవలు చేసేందుకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. పురుషులకు పీఏసీ-3, మహిళలకు సేవాసదన్ లో ఉచిత బస ఏర్పాటు చేస్తారు. ప్రతి వాలంటీరు రోజులో కనీసం 6 గంటలు విధుల్లో పాల్గొనాలి. సేవా సమయంలో శ్రీవారి స్కార్ఫ్ లను తప్పనిసరిగా ధరించాలి. ఈ వాలంటీర్లకు టీటీడీ ఎలాంటి డబ్బు చెల్లించదు. అన్ని సేవలను వాలంటీర్లు స్వచ్ఛందంగానే చేయాల్సి ఉంటుంది. మరి ఈ సేవలో మీరు పాల్గొని స్వామివారి సేవలో తరించాలంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.