వెంకన్న టెంకాయ భారం.. ఒక్కోటి రూ. 25 - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న టెంకాయ భారం.. ఒక్కోటి రూ. 25

April 19, 2018

తిరుమల వెంకన్న ధనిక దేవుడు. భక్తుల కానుకలు భారీగా వస్తుంటాయి. ఖర్చు కూడా భారీగానే ఉన్నా మిగులు చాలా ఉంది. అయినా టీటీడీ మాత్రం కాసుల కోసం టెంకాయ ధరను ఏకంగా రూ. 10 పెంచి రూ. 25కు చేర్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పెంచితే మాత్రం ఏకంగా రూ. 10 పెంచడం అన్యాయమని భక్తాదులు అగ్గిమీద గుగ్గులైపోతున్నారు. దీంతో దేవుడి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద నారికేళాన్ని కొట్టే పరిస్థితి లేదని అంటున్నారు.

కొండపైన టీటీడీ ఒక్కో టెంకాయను సోమవారం వరకు రూ.15కు అమ్మేది. మంగళవారం నుంచి రూ. 25కు అమ్ముతోంది. వీటికి డిమాండ్ భారీగా ఉందని, సప్లై తగినంతగా లేకపోవడంతో ధర రూ. 25 చేయాల్సి వచ్చిందని బోర్డు చెబుతోంది. వెంకన్నకు కొబ్బరికాయ కొట్టడం భక్తుల సెంటిమెంట్. రద్దీ వల్ల స్వామి దర్శనభాగ్యం కలగపోతే అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిపోతుంటారు కొందరు. అలాంటి కొబ్బరికాయపై ఏకంగా రూ. 10 పెంచడం ధర్మం కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీటీ ఇదివరకు భక్తులకు టెంకాయతోపాటు అగరువత్తులు, కర్పూరం కూడా ఇచ్చేది. అయితే వాయుకాలుష్యం పెరుగుతోందని అగవత్తులను ఇవ్వడం మానేసింది.