5 కోట్ల మరకతలింగం.. చెత్తకుప్పలో - MicTv.in - Telugu News
mictv telugu

5 కోట్ల మరకతలింగం.. చెత్తకుప్పలో

May 17, 2019

రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగం చెత్త కుప్పలో లభ్యమైంది. కలకలం రేపుతున్న ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా వేట్టవలంలోని శ్రీమనోర్‌మణి అమ్మన్ ఆలయంలోని రూ.5 కోట్ల విలువైన మరకతలింగం 2017లో చోరీకి గురైంది. మరకతలింగంతో పాటు అమ్మన్‌ వెండి కిరీటం(కిలో), వెండి పాదం, వడ్డానం, మరకతలింగం పెట్టేందుకు ఉపయోగించే వెండి నాగభరణం, నాలుగు గ్రాముల బంగారు తాళిబొట్టును దుండగులు దొంగిలించారు.

Tiruvannamalai temple gets back its Maragatha Lingam.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విగ్రహాల చోరీ నియంత్రణ విభాగానికి కేసును అప్పగించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే చోరీకి గురైన మరకతలింగం వేట్టవలం జమీన్‌కోట వద్ద ఉన్న ఓ చెత్తకుప్పలో ఉన్నట్లు గుర్తించిన ఓ కార్మికుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆలయ పూజారిని పిలిపించి, పాత ఫోటోలతో పరిశీలించిన తర్వాత రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగంమేనని గుర్తించారు. అనంతరం విగ్రహాల నియంత్రణ విభాగం ఐజీకి సమాచారం అందజేశారు.