Titanic ship in the ocean..amazing video
mictv telugu

రూ.10 కోట్ల ఆంబర్ గ్రిస్ పట్టివేత…తిమింగలం వాంతికి ఇంత ధరనా?

September 8, 2022

రూ.10 కోట్లు విలువ చేసే ఆంబర్ గ్రిస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించగా, ఏకంగా 4.12 కిలోలు ఉన్న ఆంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి) పట్టుబడిందని, ఈ దాడుల్లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నామని అధికారులు మీడియాకు తెలియజేశారు.

అయితే, పట్టుబడిన ఆ 4.12 కిలోలు ఉన్న ఆంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి)కు మార్కెట్లో ఖరీదు దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తిమింగలం వాంతికి ఇంత ధర ఎందుకు అనే అనుమానం మనలో కలగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో సువాసన, ప్రత్యేక గుణాలు కలిగిన తిమింగలం వాంతిని సుగంధ పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తిమింగలం వాంతితో తయారైన పెర్ఫ్యూమ్‌లు అత్యంత ఖరీదైనవిగా చలామణీలో ఉన్నాయి. అయితే, వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 ప్రకారం తిమింగలం వాంతి అమ్మకాలపై నిషేధం విధించింది.

”తిమింగలాల్లో ముఖ్యంగా స్పెర్మ్ వేల్ రకం తిమింగలాల నోటి నుంచి వచ్చే మైనం వంటి చిక్కని పదార్థాన్ని ఆంబర్ గ్రిస్ లేక గ్రే ఆంబర్, లేక నీటిపై తేలే బంగారం అని పిలుస్తుంటారు. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థం అరుదైనది, అత్యంత విశిష్టమైనది కావడంతో అతి భారీ ధర పలుకుతుంది. ఈ ఏడాది జులైలో కేరళ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా రూ.28 కోట్ల విలువైన ఆంబర్ గ్రిస్ వారి కంటపడగా, దాన్ని వారు అధికారులకు అప్పగించారు. ఈ ఆంబర్ గ్రిస్ తిమింగలాల జీర్ణవ్యవస్థ నుంచి నోటి ద్వారా వెలుపలికి విసర్జితమయ్యే ఓ పదార్థం. ఇది తిమింగలం పేగుల్లో ఉత్పత్తి అవుతుంది.” అని అధికారులు వివరాలను వెల్లడించారు.