ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో తిత్లీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పల్లెలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడుతున్నాయి. తుపాను ఉధృతి ఈ రోజు రాత్రి వరకు కొనసాగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నాయి. గంటకు 165 నుంచి 185 కి.మీ. వేగంలో పెనుగాలులు వీస్తున్నాయి. కుండపోతల వానలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది.
తిత్లీ విపత్తుతో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇప్పటివరకు 8 మంది అసువులు బాశారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశాలో 3 లక్షల మందిని ఎగువ ప్రాంతాలకు తరలించారు. ఏపీ, ఒడిశాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. తిత్లీని ఎదుర్కొనే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గంజాం, గజపతి, పూరి తదితర జిల్లాల్లో తిల్లీ విలయం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, రణస్థలం, పాతపట్నం, పోలాకి, ఆమదాలవలస, పొందూరు, సంతకవిటి మండలాలు; విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, పూసపాటిరేగ, గరివిడి, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం మండలాలు; విశాఖపట్నం జిల్లాలో బీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, రూరల్ మండలాలపై తిల్లీ ప్రభావం చూపుతోంది. ప్రాణనష్టం జరగకుండా సహయక సిబ్బంది పలు చర్యలు చేపడుతున్నారు.