Home > Featured > జాతీయపార్టీ హోదా తొలగించొద్దు.. మరో ఛాన్స్ ఇవ్వండి..

జాతీయపార్టీ హోదా తొలగించొద్దు.. మరో ఛాన్స్ ఇవ్వండి..

defend national party.

ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకునేందుకు తమకు మరో అవకాశం ఇవ్వాలని.. సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఓట్ల శాతం ఆధారంగా జాతీయ పార్టీ హోదాపై ఈ మూడు పార్టీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడు పార్టీల నేతలు సోమవారం ఈసీని కలిశారు. మూడు పార్టీలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించామని తమ వాదనలు వినిపించారు. తమకున్న జాతీయ పార్టీ హోదా తొలగించొద్దని విజ్ఞప్తి చేశాయి. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జాతీయ హోదాను తొలగించవద్దని.. తాము జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని విన్నవించుకున్నాయి.

తమ పార్టీ ప్రాచీనమైందని.. కాంగ్రెస్‌ పార్టీ తర్వాత లోక్‌సభలో తమ పార్టీ చాలాసార్లు ప్రతిపక్షంగా ఉందని సీపీఐ ఈసీ ముందు పేర్కొంది. ఇటీవలి ఎన్నికల్లో సరైన పనితీరు కనబరచకపోయామనీ.. అయినా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ వచ్చామని చెప్పింది. రాజ్యాంగ పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తున్నామని వాదనలు వినిపించింది. 2014లో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చారని, కాబట్టి కనీసం 2024 వరకు ఆ హోదా కొనసాగించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీ ముందు చెప్పింది.

ఈసీ నిబంధనల ప్రకారం ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జరిగే లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాల్సి వుంటుంది. కనీసం లోక్‌సభలో నలుగురు సభ్యులను కలిగి ఉండాలి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ మేఘాలయ.. జాతీయ పార్టీ హోదాను కలిగివున్నాయి.

కాగా, 2014 ఎన్నికల ఫలితాల అనంతరం సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ జాతీయ హోదాను కోల్పోయే దశకు చేరుకున్నాయి. అయితే 2016లో ఈసీ కొన్ని నిబంధనలను సడలించింది. జాతీయ, ప్రాంతీయ హోదాల అంశాన్ని సమీక్షించే విధానాన్ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. దీంతో ఆ పార్టీలు ఆ హోదాలో కొనసాగుతూ వచ్చాయి. అయితే, ఇటీవల ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీ 10 లోక్‌సభ స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి సేఫ్ అయింది.

Updated : 9 Sep 2019 11:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top