బీజేపీ నేత దారుణ హత్య.. బెంగాల్‌లో ఉద్రిక్తత.. - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ నేత దారుణ హత్య.. బెంగాల్‌లో ఉద్రిక్తత..

June 12, 2019

TMC Vs BJP Clashes -BJP Party To Protest Against TMC Government

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన ఆశిష్‌ సింగ్‌(47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన అతను మాల్దాలోని ఓ ప్రాంతంలో శవమై తేలాడు. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇంగ్లీష్‌ బజార్‌ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తమ పార్టీ నేతలు ఇలా వరుసగా దారుణ హత్యలకు గురవుతున్నారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. సోమవారం ఈ మేరకు ‘బ్లాక్‌ డే’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా నిర్వహించనున్నట్లు జీజేపీ  అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యలపై  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. లా అండ్‌ ఆర్డర్‌ను అమల్లో పెట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. కాగా, బెంగాల్‌లో వరుస రాజకీయ హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన హత్యతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ ఘటనపై బెంగాల్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలు వెలువడిన తర్వాతే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ను సక్రమంగానే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పరిస్థితి ఇప్పటికయితే అదుపులోనే ఉందని, హత్యలకు ఎవరు కారణమయినా వారికి కఠిన శిక్ష పడుతుందని తెలిపారు.