శేషన్‌ను కూడా చంపేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

శేషన్‌ను కూడా చంపేశారు..

April 2, 2018

సోషల్ మీడియా ప్రధాన మీడియాతో పోలిస్తే నిస్పాక్షిక వార్తలను.. అది కూడా వేగంగా అందిస్తుంది. అందుకే జనానికి అంత క్రేజ్. అయితే హడావుడి వల్ల, అందుబాటులో సరైన సమాచారం లేకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి. నటి జయంతి, మాజీ ప్రధాని వాజ్‌పేయి చనిపోయారని వార్తలు రావడం, తర్వాత అది నిజం కాదని లెంపలు వేసుకోవడం తెలిసిందే. ఈ ఖాతాల్లో కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషన్, చండశాసనుడు టీఎన్ శేషన్ కూడా చేరిపోయారు.85 ఏళ్ల శేషన్ వృద్ధాప్య కారణాలతో చనిపోయారని ఈ రోజు పలు వెబ్ సైట్లలో, టీవీ చానళ్లలో వార్తలు వచ్చాయి. ఆయన అభిమానులు రిప్ అని నివాళి అర్పించారు. ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాలు వెల్లువెత్తాయి. అయితే శేషన్ మృతదేహం ఎక్కడుంది, ఎప్పుడు అంత్యక్రియలు జరుపుతారన్న వివరాలను కొందరు ఆరాతీయడంతో నిజం తెలిసింది. చనిపోయింది శేషన్ కాదని, ఆయన భార్య జయలక్ష్మీ శేషన్ అని తెలిపింది. ఆమె శనివారం కన్నుమాశారు. అయితే ఆమె పేరులోనూ శేషన్ ఉండడంతో ఈ ఉత్తిచావు వార్తలు వచ్చాయి. శేషన్ దంపతులకు పిల్లలు లేరు. 1990 నుంచి 96 వరకు సీఈసీగా పనిచేసిన శేషన్ అక్రమాలకు పాల్పడుతున్న పార్టీలకు చుక్కులు చూపించారు.