తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యా.. భర్తల మధ్య విడాకుల వివాదం..వారి కుటుంబ సభ్యులను కూడా బలితీసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య.. సోదరి ఇంటికి వచ్చేయడంతో ఆగ్రహానికి గురైన భర్త ఆ ఇంటిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్యభర్తలతో సహ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
సద్గురు, ధనలక్ష్మీ దంపతులు రెండేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఆరు నెలల బిడ్డ ఉన్నాడు. కొన్ని రోజులు సంసారం బాగానే నడిచినా తర్వాత గొడవలు మొదలయ్యాయి. విడాకులు ఇవ్వాలని భార్య ధనలక్ష్మీతో భర్త సద్గురు తరచూ గొడవ పడేవాడు. దీంతో ఆమె తన సోదరి తమిళరసి నివాసానికి వచ్చేసింది. ఆ ఇంట్లో తమిళిరసితో పాటు ప్రసాద్, ఏడాది వయసున్న కుమార్తె హాసిని, తల్లి సెల్వి నివాసం ఉంటున్నారు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఫోన్లో తరచూ గొడవలు జరిగేవి. భర్త విడాకులు ఇవ్వమని కోరగా…భార్య అందుకు నిరాకరిస్తూ వచ్చేది. దీంతో భర్త సద్గురు నేరుగా ధనలక్ష్మి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. అది కాస్త పెద్దది కావడంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఇంట్లో జల్లి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్ల వారందరూ మంటల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత తానూ మంటల్లో దూకేశాడు సద్గురు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లతో పాటు భార్యభర్తలు సద్గురు, ధనలక్ష్మి, సోదరి తమిళరసి మరణించారు. తల్లి సెల్వి పరిస్థితి విషమంగా ఉంది. ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.