To get government schemes..it is mandatory: center
mictv telugu

ప్రభుత్వ పథకాలు పొందాలంటే..ఇది తప్పనిసరి:కేంద్రం

August 17, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పేద, ధనిక ప్రజలందరికి కేంద్ర ప్రభుత్వం ఓ పిడుగులాంటి విషయాన్ని తెలియజేసింది. ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తూ, తాజాగా యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు పొందాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు వర్తించాలన్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట.

యూఐడీఏఐ అధికారులు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ..ఈ నెల 11వ తేదీనే అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేశారు. ”ఆధార్‌ లేనివాళ్లు వెంటనే ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ అయినా చూపించాలి. దేశంలో 99 శాతం మంది వయోజనులకు ఆధార్‌ కార్డుల జారీ పూర్తయింది. ఇకపై ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి చేశాం. ఆధార్ నంబర్ లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ లేని వారు ఇక‌పై ప్రభుత్వ రాయితీలు, ప్ర‌భుత్వ ప్రయోజనాలను పొందలేరు” అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

మరోపక్క ఆధార్ కార్డ్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగటం లేదు. సిమ్‌కార్డ్ కావాలన్నా, బ్యాంక్ పాస్ బుక్ కావాలన్నా, రైల్యే టికెట్లు కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, ఆసుపత్రికి వెళ్లలన్నా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా ఆధార్ కార్డు లేనివారు వెంటనే ఆధార్ కేంద్రానికి వెళ్లి, దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. కేంద్ర ఆదేశించిన విధంగా ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందాలంటే ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తం అవ్వాలని అధికారులు సూచించారు.