గవర్నర్‌ తమిళిసైకి.. జగదీష్‌రెడ్డి కౌంటర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్‌ తమిళిసైకి.. జగదీష్‌రెడ్డి కౌంటర్‌

April 6, 2022

htft

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ‘నేను ప్ర‌ధానిని క‌లిసింది. తెలంగాణ స‌ర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాదు. తెలంగాణ‌లో నాకు ఎవ‌రితోనూ విభేదాలు లేవు’ అని ఆమె తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లోకి గవర్నర్‌ రాజకీయాలు తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ”గవర్నర్‌ తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరం. గవర్నర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటిస్తుంది. గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించుకుని, బీజేపీ రాజకీయాలు చేస్తోంది” అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

అంతేకాకుండా ”గవర్నర్‌గా వస్తే గౌరవించడంలో మాకు ఎలాంటి‌ అభ్యంతరం లేదు. కానీ రాజకీయ పార్టీ నేతగా వస్తే గౌరవించాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదనేది అవాస్తవం. ప్రొటోకాల్‌ పాటించకపోతే ఆక్షణంలోనే కేసీఆర్ చర్యలు తీసుకుంటారు. పెద్దవాళ్లను ఎలా గౌరవించాలనేది కేసీఆర్ మాకే నేర్పుతారు. గవర్నర్ వస్తున్నారంటే కేసీఆర్ స్వాగతం పలికి‌ గౌరవం ఇస్తారు. గవర్నర్‌ని‌ గౌరవించే విషయంలో ఏనాడు చిన్న తప్పుకూడా దొర్లలేదు. గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకు గవర్నర్ అలా స్పందించారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ సందర్భంలో రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించలేదో చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు.