Today gold and silver prices Hyderabad bullion market
mictv telugu

భగ్గుమన్న బంగారం.. వెండి ఢమాల్..

November 17, 2022

వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేమన్నట్లుగా తయారయ్యాయి బంగారం, వెండి ధరలు. గురువారం పసిడి బులియన్‌ వినియోగదారులకు చుక్కలు చూపింది. పచ్చ లోహం ధర భారీగా పెరగ్గా, తెల్ల లోహం ధర ఢమాల్‌మంది. నెలకిందటి వరకు భారీగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు కొన్నాళ్లుగా మళ్లీ ఊపందుకున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 48,000 నుంచి రూ. 750 పెరిగి రూ. 48,750 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 52,360 నుంచి రూ. 820 పెరిగి రూ. 53,180కి చేరుకుంది.

మరోపక్క వెండి ధర భారీ పతనం నమోదు చేసింది. కేజీకి ఏకంగా రూ. 1350 తగ్గి రూ. 67,200కు చేరుకుంది. కొన్ని నెలల కిందట 60 వేల లోపే పలికిన రజతం కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లి పతనమైంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం ఎలాంటి పండగలు లేకపోయినా పెరుగుదల నమోదైంది. మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ డిమాండులో మార్పులు వల్ల పసిడి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి.