కోవిడ్ కేసులు మళ్లీ పెరగడం, ఆర్థిక వ్యవస్థల మందగమనం బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. బంగారం, వెండి ధరలు పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్తున్నాయి. నెల రోజులుగా సాగుతున్న పెరుగుదల ట్రెండ్ కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. మంగళవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. పసిడి ధర ఊహించినట్లుగా 56 వేల దరిదాపులకు చేరింది. వెండి ధర షాకిచ్చేలా పెరిగింది. ఐదారు నెలల కిందట కేజీ 60 వేల దగ్గర తచ్చాడిన రజతం ధర రూ. 75,500కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 500 పెరిగి రూ. 50,450 నుంచి రూ. పెరిగి రూ. 50,950 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 55,040 నుంచి రూ. 540 పెరిగి రూ. 55,580కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కేజీకి ఏకంగా రూ. 1000 పెరిగి రూ. 75,500కు చేరుకుంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకల నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి.