బంగారం, వెండి ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ ఊపుతో పెరిగిన ధరలు అదే ధోరణిలో సాగుతున్నాయి. దక్షిణాదిలో సంక్రాంతి, పొంగల్ సీజన్ వచ్చేయడంతో మరింత పెరిగిపోతూ కొనుగోలుదారులను నిరాశపరుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 400 పెరిగి రూ. 51,600 నుంచి రూ. పెరిగి రూ. 52,000 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 56,290 నుంచి రూ. 440 పెరిగి రూ. 56,730కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కాస్త పైకి ఎగబాకింది. కేజీకి రూ. 100 పెరిగి రూ. 75,000కు చేరుకుంది.
దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకలు, సంక్రాంతి నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ పరిమాణాలతో సంబంధం లేకుండా రోజురోజూకు పైకి వెళ్లిపోతున్నాయి. కోవిడ్ కేసుల వ్యాప్తి, ప్రపంచం మళ్లీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఫలితంగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పసిడి ధరలు రూ. దాదాపు 10 వేలు పెరిగాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ రెండు మూడు నెలల్లోనే నిపుణులు ఊహించినట్లు 24 కేరట్ల బంగారం రూ. 60 వేలకు, 22 కేరట్ల బంగారం రూ. 55 వేలకు చేరుకోవడం ఖాయం.