ప్రపంచం మరికొన్ని గంటల్లో 2023లో ఉత్సాహంగా అడుగుపెడుతోంది. బంగారం ధర కూడా ఊపుతో ముందుకు దూసుకెళ్తోంది. శుక్రవారం 55 వేల మార్కుకు కొన్ని పదుల రూపాయల దూరంలో ఆగిపోయిన స్వచ్ఛమైన పసిడి ధర సంవత్సరాంతం రోజున ఆ మార్కును కూడా దాటేసింది. భగ్గుమంటున్న వెండి మాత్రం కాస్త తగ్గింది. క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ వేడుకకు పసిడి అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 50,350 నుంచి రూ. 250 పెరిగి రూ. 50,600 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 54,930 నుంచి రూ. 270 పెరిగి రూ. 55,200కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కాస్త తగ్గింది. కేజీకి రూ. 200 పెరిగి రూ. 74,300కు చేరుకుంది. కొన్ని నెలల కిందట 60 వేల లోపే పలికిన రజతం కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లింది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కాస్త బలపడ్డంతో మదుపర్లు సురక్షితమైన బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు.