Today is KY Yesudas Birthday
mictv telugu

జేసుదాసు పాటకు ఆ భగవంతుడూ దాసుడే..!!

January 10, 2023

Today is KY Yesudas Birthday

నేడు గానగంధర్వుడు డా.కె.జె.యేసుదాస్ 83వ జన్మదినం. మలయాళీలు ప్రేమగా పిలుచుకునే అభిమాన దాసేతన్ తన కలకాలం నిలిచిపోయే మధుర గాత్రంతో సంగీత ప్రియులను నేటికీ అలరిస్తూనే ఉన్నారు. ఎనభై మూడేళ్ళ వయసులో కూడా డా.కె.జె. యేసుదాస్ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్ర ప్రపంచంలో దాదా 62 ఏళ్లు పూర్తి చేసుకున్న డా. KJ యేసుదాస్ 1961లో కల్పపదాలు చిత్రానికి ప్లేబ్యాక్ పాడటం ద్వారా తన అద్భుతమైన సంగీత జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ఏసుదాస్ 1940 జనవరి 10న ఫోర్ట్ కొచ్చిలో జన్మించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు అగస్టిన్ జోసెఫ్ భాగవతార్, ఎలిజబెత్ దంపతులకు యేసుదాస్ జన్మించారు. ఈ దంపతుల ఏడుగురు సంతానంలో యేసుదాసు రెండవవాడు.

మలయాళీలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు. కేజే ఏసుదాస్ స్వరం ప్రేమ, వాంఛ, దుఃఖం, నిరాశ, సంతోషం వంటి భావాలకు ప్రతిబింబం. ఏసుదాసు సున్నితమైన ప్రేమతో పాడిన ప్రతిసారీ పాటల్లో హద్దులు లేని ప్రేమ నిండిపోతుంది. ఏసుదాసు పాటు తరతరాలుగా భగ్న ప్రేమికుల ప్రేమగీతాలను సున్నితంగా పలికే గాయకుడు. ఏసుదాస్ తన మంత్రముగ్ధులను చేసే స్వరంతో కుల, మతాలకు అతీతంగా ఎన్నో భక్తిగీతాలలో హిట్స్ ఇచ్చారు. నేడు ఏ షిరిడీ సాయిబాబా దేవాలయం వెళ్లినా, ఎక్కడ అయ్యప్ప పూజ జరిగినా ఏసు దాసు పాట లేకుండా ప్రారంభం అవడం అసాధ్యం.

తెలుగులో ఆయన తొలిసారిగా ‘బంగారు తిమ్మరాజు’ సినిమాతో అరంగేట్రం చేశారు. కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ కోదండపాణి మ్యూజిక్ డైరక్షన్ లో ఏసుదాస్ “ఓ నిండు చందమామా” అనే పాట తొలిసారిగా పాడారు. యన్టీఆర్ నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’లో “శ్రీరామ జయరామ… జయ జయ రామా…” పాటను కొన్ని శ్లోకాలను ఏసుదాస్ తో పాడించారు. దీంతో అన్నగారు సైతం ఏసుదాసు స్వరానికి ముగ్ధుడయ్యారు. అక్కినేని నాగేశ్వరావు నటించిన మేఘ సందేశం చిత్రంలో ఆయన పాడిన పాటలకు జాతీయ అవార్డులు సైతం దక్కాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఒక దశలో ఎస్పీ బాలుతో పొరపచ్చాలు ఏర్పడిన సమయంలో ఆయన సైతం ఏసుదాసుకు అవకాశం కల్పించారు. ఇక తెలుగులో ఏసుదాసు పాటలను పట్టుబట్టి మరీ తన సినిమాల్లో పాడించుకున్న నటుల్లో మోహన్ బాబు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో కచ్చితంగా ఒక పాట ఏసుదాసు చేత పాడించుకోవడం విశేషం. పెదరాయుడు చిత్రంలో కదిలే కాలమా అనే పాట ఎవర్ గ్రీన్ పాటగా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా నిర్మించి నటించిన రుద్రవీణ సినిమాలో లలిత ప్రియకమలం విరిసినది అంటూ సాగే పాట ఇప్పటికీ, ఎప్పటికీ, మరచిపోలేని మధురానుభూతిని మిగుల్చుతుంది. అంతులేని కథ సినిమాలో దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి అనే పాట ఇప్పటికీ, ప్రతీ ఒక్కరికి వేదాంతం సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.

ఏసుదాస్ పాడని భారతీయ భాషలు లేవు. ఆయనకు 8 సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాలు ఆయనను ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డుతో సత్కరించాయి. యేసుదాస్ అస్సామీ, కాశ్మీరీ, కొంకణి మినహా అన్ని ప్రధాన భాషలలో పాడారు. 2017లో పద్మవిభూషణ్‌, 2002లో పద్మభూషణ్‌, 1973లో పద్మశ్రీతో ఏసుదాసును కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.