తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర జరుగుతోంది. సర్కారు కొలువుల కోసం సన్నద్ధమవుతోన్న ప్రతి నిరుద్యోగికి ఈ విషయం తెలిసే ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించినట్లుగానే గతేడాది చివరలో భారీగా నోటిఫికేషన్లను వేసింది. గ్రూప్-1, 2, 3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, అకౌంట్స్, అగ్రికల్చర్, స్టాఫ్ నర్స్, ఎంఏయూడీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు, ట్రాన్స్పోర్ట్ ఏఎంవీఐ, బీఐఈ, హాస్టల్ వెల్ఫేర్ తదితర నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడ్డాయి. మరికొన్ని త్వరలో వెలువడనున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే.. రాష్ట్ర అవతరణ తర్వాత దాదాపుగా పది ఏండ్ల తర్వాత తొలిసారిగా నోటిఫికేషన్ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ల పోస్టులకు అప్లై చేయడానికి నేడే ఆఖరు తేది.
10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ పోస్టులకు మొత్తం 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నేటితో జేఎల్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా దరఖాస్తులు సమర్పించని అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1392 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టులలో అత్యధికంగా మ్యాథ్స్ 154, ఇంగ్లీష్ 153, జువాలజీలో 128, హిందీ 117, కెమిస్ట్రీ 113, ఫిజిక్స్ 112 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.