దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జనవరి 24 నుంచి 31వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఈరోజే ఆఖరి గడువు. ఈరోజు రాత్రి 9గంటల వరకు మాత్రమే విద్యార్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉండగా.. దరఖాస్తు రుసుము మాత్రం అదేరోజు రాత్రి 11.50గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలు ఏయే నగరాల్లో నిర్వహిస్తారనే విషయాన్ని ఈ వారంలోనే వెల్లడించనుండగా.. అడ్మిట్ కార్డులను మాత్రం వచ్చే వారం నుంచి డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచనున్నారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోని విద్యార్థులు ఇలా దరఖాస్తు చేసుకోండి.
• అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inను సందర్శించండి.
• జేఈఈ మెయిన్ 2023 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
• అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ అవ్వండి.
• పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి
• ఆ దరఖాస్తును డౌన్‌లోడ్‌చేసి.. కాపీని మీ వద్దే ఉంచుకోండి
ఇదిలా ఉండగా.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అర్హత విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ విద్యామండలి పర్సంటైల్ లో అగ్రస్థానంలో ఉన్న తొలి 20 మందికి ఐఐటీ, ఎ న్ఐటీ ప్రవేశ పరీక్షల్లో సడలింపు ఉంటుందని తెలిపింది. అలాంటి విద్యార్థులు 75 శాతం మార్కులు సాధించలేకపోయినా.. ఈ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు హాజరుకావొచ్చని తెలిపింది. అనేక రాష్ట్రాల్లో పర్సంటైల్ లో అగ్రస్థానంలో ఉంటున్న అభ్యర్థులు 12వ తరగతిలో 75 శాతం పొందలేకపోతున్నారు. అలాంటి అభ్యర్థులందరికీ ఈ నిర్ణయం వరంలా మారనుంది.