Today Super-4..India-Pak will face
mictv telugu

మొదలైన సూపర్-4..నేడు తలపడనున్న భారత్-పాక్

September 4, 2022

ఆసియా కప్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని జట్లు ఇంటిబాటను పడితే, మరికొన్ని జట్లు సూపర్-4కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గతరాత్రి నుంచి ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇటీవలే భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో భారత్‌పై కచ్చితంగా గెలవన్న లక్ష్యంతో పాక్ ఆటగాళ్లు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్‌ జట్లు రెండోసారి తలపడనున్న సందర్భంగా క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిహద్దు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని లోటును తీరుస్తూ, టోర్నీలో జరుగుతున్న రెండో రౌండ్‌ పోరు కూడా అంతే ఆసక్తిని రేపుతోంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయింది. ఈరోజు కూడా రోహిత్‌ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీలోని పాక్‌ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

”వారం కిందట చిరకాల ప్రత్యర్థుల పోరు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. హోరాహోరీగా సాగి, ఉత్కంఠ భరితంగా ముగిసిన ఆ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. టోర్నీలో సూపర్-4కు అర్హత సాధించిన ఈ రెండు జట్లు ఇప్పుడు మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆదివారం మళ్లీ దాయాది జట్ల సమరం చూడబోతున్నాం. తొలి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చి, త్రుటిలో ఓడాక పాకిస్థాన్ జట్టు..హాంకాంగ్‌పై బ్యాటుతో, బంతితో చెలరేగిపోయింది. దీంతో టీమ్ ఇండియాకు హెచ్చరికలు పంపింది. కసి మీద ఉన్న పాకిస్థాన్ జట్టు..ఈరోజు రోహిత్ సేనతో ఎలా తలపడనుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ 7:30 నుంచి హార్ట్‌స్టార్‌లో ప్రసారం కానుంది”