తల్లి ఫోన్ నుంచి 31 బర్గర్లు ఆర్డర్.. బిల్లు చూసి షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి ఫోన్ నుంచి 31 బర్గర్లు ఆర్డర్.. బిల్లు చూసి షాక్

May 18, 2022

ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారని.. వారిని సముదాయించేందుకు మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్‌ను వారి చేతికిచ్చారో ఇక అంతే. ఆ ఫోన్‌తో వారు ఆడుకుంటున్నారో.. లేదా మనల్నే ఒక ఆట ఆడిస్తారో తెలియదు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు అచ్చం ఇలాంటి పనే చేశాడు. ఆ చిన్నారి చేసిన పనికి అతని త‌ల్లి అవాక్కైంది. బారెట్ అనే చిన్నారి తన తల్లి ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెక్‌డోనాల్డ్స్‌కు 31 బ‌ర్గ‌ర్ల ఆర్డ‌ర్ ఇచ్చేశాడు. డోర్‌డాష్ ఫుడ్ డెలివ‌రీ యాప్ ద్వారా ఆ ఆర్డ‌ర్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. ఆర్డ‌ర్ త‌యారు చేసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని మెసేజ్ రావ‌డంతో త‌ల్లి షాకైంది. తాను కంప్యూట‌ర్ ప‌నిలో నిమ‌గ్న‌మైన స‌మ‌యంలో త‌న పిల్లోడు తెలియ‌కుండానే బ‌ర్గ‌ర్లు ఆర్డ‌ర్ చేసిన‌ట్లు ఆమె చెప్పింది. ఈ మొత్తం బ‌ర్గ‌ర్ల‌కు 62 డాల‌ర్ల బిల్లు అయ్యింది.
చివ‌ర‌కు బ‌ర్గర్లు డెలివ‌రీ కాగానే, వాటి ప‌క్క‌న త‌న కుమారుడిని ఉంచి ఫొటో తీసింది. ఈ ఆర్డ‌ర్ తెచ్చిన డెలివ‌రీ బాయ్ కి 16 డాల‌ర్ల టిప్ కూడా ఇప్పించిన‌ట్లు ఆ త‌ల్లి తెలిపింది. 31 బ‌ర్గ‌ర్ల‌ను ఏం చేయాలో తెలియ‌క వాటిని కొంద‌రికి డొనేట్ చేసింది. ఇంకోసారి తన కుమారుడు డోర్‌డాష్ యాప్‌ను వాడ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది.