కట్టి పడేస్తుంది.. ! - MicTv.in - Telugu News
mictv telugu

కట్టి పడేస్తుంది.. !

February 10, 2018

‘తొలిప్రేమ’  తెలుగు ప్రేక్ష‌కుల‌కు, మెగా అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు.. 20 ఏళ్ల క్రితం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా రూపొందిన తొలిప్రేమ చిత్రం తెలుగు చిత్ర‌సీమ‌లో ప‌లు రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచిన ఆ   టైటిల్‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌డ‌మంటే ఒక‌ర‌కంగా సాహసమే. వ‌రుణ్‌తేజ్, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ధైర్యంగా ఈ ప్ర‌య‌త్నాన్ని చేశారు. తొలి ప్రేమ టైటిల్ ఖ‌రారు చేసిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాతో దీనిని పోలిక‌లు ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రిగింది.  పేరులో త‌ప్ప క‌థ‌, క‌థ‌నాల్లో ఎక్క‌డా ఆ సినిమాతో సంబంధం ఉండ‌దు.

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ పంథా విభిన్నం. మిగ‌తా వారంతా మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ బాట‌లో ప‌య‌నిస్తే తాను మాత్రం క‌థాబ‌ల‌మున్న వైవిధ్య‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ‘ఫిదా’ సినిమాతో కెరీర్‌లోనే పెద్ద విజ‌యాన్నిఅందుకున్న వ‌రుణ్‌తేజ్ న‌టించిన సినిమా ఇది. క‌థ‌ల ఎంపిక‌లో మ‌రోసారి త‌న అభిరుచుల‌ను చాటుకున్నారు.

ప్రేమ‌క‌థ‌ల జ‌యాప‌జ‌యాలు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభాపాట‌వాల పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. జంట మ‌ధ్య భావోద్వేగాల్ని, సంఘ‌ర్ష‌ణ‌ను తెర‌పై స‌రిగ్గా ఆవిష్క‌రించిన‌ట్ల‌యితే తెలిసిన క‌థ‌తోనైనా ప్రేక్ష‌కుల్ని మెప్పించేందుకు ఆస్కారముంటుంది. తొలిప్రేమ సినిమాతో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి అదే దారిని అనుస‌రించారు. తొలి ప్రేమ ఔన్న‌త్యాన్ని, త‌మ ప్రేమ‌ను స‌ఫ‌లం చేసుకొనే క్ర‌మంలో జంట ప‌డిన త‌ప‌న‌ను వెండితెర‌పై స‌హ‌జంగా చూపించారు. నిజాయితీగా త‌ను న‌మ్మిన క‌థ‌ను వెండితెర‌పై ఆవిష్కృతం చేశారు.

ఆదిత్య(వ‌రుణ్‌తేజ్‌) తెలివైన కుర్రాడు. చ‌దువులో టాప‌ర్‌. త‌న మ‌న‌సులో ఏం అనిపిస్తే అది వెంట‌నే చెబుతాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించ‌డు. ఆవేశం ఎక్కువే. ఓ ప్ర‌యాణంలో వ‌ర్ష(రాశీ ఖ‌న్నా) అత‌డికి తార‌స‌ప‌డుతుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. కానీ ఆదిత్య‌తో పోలిస్తే వ‌ర్ష‌ది భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం. ఏపైనా ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల‌న్న‌ది ఆమె సిద్ధాంతం. వ‌రుణ్ అంటే  ఇష్ట‌మున్న త‌న ప్రేమ‌ను అత‌డికి చెప్ప‌కుండా మ‌న‌సులోనే దాచుకుంటుంది. కాలేజీలో సోము అనే సీనియ‌ర్ కార‌ణంగా వ‌రుణ్‌, వ‌ర్ష మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తాయి. వ‌ర్ష‌పై కోపంతో ఆదిత్య ఆమెకు దూరం అవుతాడు. లండ‌న్ వెళ్లిపోతాడు. అత‌డిని వెతుక్కుంటూ వ‌ర్ష లండ‌న్ వెళుతుంది. అత‌డు ప‌నిచేస్తున్న కంపెనీలోనే చేరుతుంది. అయితే వ‌ర్ష‌పై వ‌రుణ్‌కు ప్రేమ ఉన్నా ద్వేషం ఆమెతో చెప్ప‌లేక‌పోతుంటాడు. త‌న‌ను అపార్థం చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ఏమైంది. ఆదిత్య‌, వ‌ర్ష ఏ విధంగా ఏక‌మ‌య్యార‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

తొలిప్రేమ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధుర‌మైన‌ది.  జీవితాంతం ఆ జ్ఞాప‌కాలు మ‌న‌సులో క‌ద‌లాడుతూనే ఉంటాయి. తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డిన ఓ జంట త‌మ మ‌ధ్య నెల‌కొన్నఅపార్థాల్ని, మ‌న‌స్ప‌ర్థ‌ల్ని  తొల‌గించుకొని ఏ విధంగా ఏక‌మ‌య్యార‌న్న‌దే ఈ చిత్ర ఇతి వృత్తం. ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఆద్యంతం మ‌న‌సుల్ని క‌దిలించేలా సినిమాను  రూపొందించారు.  రైలు ప్ర‌యాణంలో ప్రేమ జంట మ‌ధ్య మొద‌లైన ప్రేమ‌, వారిద్ధ‌రు మ‌ళ్లీ కాలేజీలో కాక‌తాళీయంగా క‌లుసుకోవ‌డం, అభిప్రాయ‌భేదాల కార‌ణంగా విడిపోవ‌డం వంటి స‌న్నివేశాల్ని స‌హ‌జంగా తెర‌పై చూపించారు. ఎక్క‌డా సినిమాటిక్‌ఫీల్‌గానీ, లాజిక్‌ల‌కు లేకుండా క‌థాగ‌మ‌నం సాగ‌డం కానీ క‌నిపించ‌దు. ప్రియురాలు లేదా ప్రియుడు దూర‌మై ఓ జంట ప‌డే ఆవేద‌న‌ను, వారి మ‌నో సంఘ‌ర్ష‌ణ‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించ‌డంలో చాలా వ‌ర‌కు స‌ఫ‌ల‌య్యాడు. తొలి సినిమా అయినా ఆ అనుభూతి క‌ల‌గ‌నీయ‌కుండా ఎంతో అనుభ‌వ‌మున్న వాడిగా సినిమాను మ‌లిచారు. ప్రేమ‌క‌థ‌ను అందంగా చూపించారు. సున్నిత‌మైన అంశాన్ని ఎలాంటి త‌డ‌బాటు లేకుండా ఆహ్ల‌ాద‌భ‌రింగా తెర‌పై చూపించారు.

ప్రేమ‌కు కుల‌మ‌తాలు అడ్డంకి కాద‌ని చాటిచెప్పే స‌న్నివేశం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడిగానే కాకుండా క‌థ‌కుడిగా ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు. అన‌వ‌స‌ర‌పు హంగులు, క‌మ‌ర్షియ‌ల్ అంశాల కోసం పాకులాడ‌కుండా  సినిమాను న‌డిపించిన తీరు బాగుంది. రెండు భిన్న కాలాలు, ప్ర‌దేశాల్లో సాగే క‌థ ఇది. క‌థ‌లోని ఫీల్ ఎక్క‌డ మిస్ కాకుండా వాటిని క‌ల‌గ‌లుపుతూ క‌థ‌నాన్ని న‌డిపించిన తీరు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్ధంప‌ట్టింది. ఈ సినిమాతో వెంకీ అట్లూరి రూపంలో తెలుగు చిత్ర‌సీమ‌కు మ‌రో మంచి ద‌ర్శ‌కుడు దొరికాడు.

ప్రియురాలు దూర‌మై ఆమె ఊహ‌ల్లో  నిరంత‌రం బ‌తికే యువ‌కుడిగా వ‌రుణ్‌తేజ్ ప‌రిణితితో కూడిన న‌ట‌న‌ను  క‌న‌బ‌రిచారు. ప్రేమికుడిగా, కాలేజీ విద్యార్థిగా, స్నేహం కోసం ప్రాణ‌మిచ్చే యువ‌కుడిగా భిన్న పార్శ్వ‌ల్లోసాగే పాత్ర‌లో  ఒదిగిపోయారు.  ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అత‌డి  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఆద్యంతం స్టైలిష్‌గా ద‌ర్శ‌కుడు అత‌డి పాత్ర‌ను తీర్చిదిద్దారు. గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్న‌ది రాశీఖ‌న్నా. త‌న అభిన‌యంతో మెప్పించింది. వ‌ర్ష పాత్ర‌కు ప్రాణ‌ప్ర‌తిష్ట చేసింది. వ‌రుణ్‌తేజ్ రాశీఖ‌న్నా కెమీస్ట్రీ వ‌ర్క‌వుట్ అయింది. వారిద్ద‌రు క‌నిపించే ప్ర‌తి స‌న్నివేశం సినిమాను నిల‌బెట్టింది. ఆది, ప్రియ‌ద‌ర్శి, న‌రేష్ కామెడీ  బాగుంది. ముఖ్యంగా హైప‌ర్ ఆది త‌న‌దైన శైలిలో పంచ్ డైలాగ్‌ల‌తో న‌వ్వించారు. సుహాసిని క‌నిపించేది కొద్దిక్ష‌ణాలే అయినా త‌న అనుభ‌వంతో పాత్ర‌కు ప్రాణం పోసింది.

త‌మ‌న్ బాణీలు, నేప‌థ్య సంగీతం, జార్జ్ సి విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ క‌థ‌కు ప్రాణం పోశాయి. కొత్త ద‌ర్శ‌కుడిపై  న‌మ్మ‌కంతో బ‌డ్జెట్ గురించి ఆలోచించ‌కుండా క‌థ‌కు న్యాయం చేయ‌డానికి భారీగా ఖ‌ర్చుచేశారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్‌. లండ‌న్‌లో తెర‌కెక్కించిన ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌ద‌నాన్ని పంచుతుంది.

సాధార‌ణ ప్రేమ‌క‌థ‌ల‌తో పోలిస్తే భిన్న‌మైన అనుభూతిని పంచే చిత్ర‌మిది.  తొలి ప్రేమ జ్ఞాప‌కాల్ని ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుకుతెస్తుంది. మంచి సినిమా చూశామ‌నే సంతృప్తిని మిగులుస్తుంది. మ‌ల్టీఫ్లెక్స్  వ‌ర్గాల‌ను అల‌రించే హంగులు ఈ సినిమాలో ఎక్కువ‌గా ఉన్నాయి, బీ, సీ వ‌ర్గాల‌కు ఈ సినిమా ఏ మేర‌కు చేరువ‌వుతుందో వేచిచూడాల్సిందే.

రేటింగ్‌:3.25/5