తెలుగు సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖహాస్య నటుడు కోసూరి వేణుగోపాల్ కన్నుమూశారు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనా వచ్చిన ఆయన కోలుకున్న తర్వాత గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
వేణుగోపాల్ 23 రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే పరీక్షలు చేయగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా ఆరోగ్యంలో మార్పు కనిపించలేదు. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూనే గుండె పోటుతో చనిపోయారు. కాగా, ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. మర్యాద రామన్న, పిల్లజమిందారు, చలో వంటి చిత్రాల్లో నటించారు. ఆయన నటన, హస్యంతో అందరిని మెప్పించారు. కొద్ది సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.