రాజకీయాల్లోకి మంచు మనోజ్.. తెలంగాణలోనూ..! - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి మంచు మనోజ్.. తెలంగాణలోనూ..!

October 22, 2018

దక్షిణాది రాజకీయాల్లోకి మరో నటుడు..! వయసుపైబడిన నటుడు కాదు, యవనటుడే. గమ్యం లేని ప్రయాణాలు మనశ్శాంతిని దూరం చేస్తాయని,  త్వరలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నానని మంచు మనోజ్ చెప్పాడు. ఈమేరకు అభిమానులకు మనోగతాన్ని వెల్లడించారు. అతడు రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు అందులో సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలను ఉద్దరించడం, యువతకు ఏదైనా చేస్తాను వంటి మాటలు నిందుకు నిదర్శనమంటున్నారు.  తండ్రి మోహన్ బాబు బాటలో అతడు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడని చెబుతున్నారు..Tollywood actor Manchu Manoj indicates about political entry from Tirupati says he will too try from Telangana and contribute for children education

లేఖ ఇదీ..

జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నానని అతడు చెప్పారు. ’’తన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి ‘పరుగు’ కూడా ఒక రోజు పరిగెత్తడం ఆపేస్తుంది. ఇవాళో రేపో ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి తప్పదు. గమ్యంలేని లక్ష్యాలు ఎన్నటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతీ లక్ష్యానికి ఒక గోల్‌ ఉండాలి. ఆ లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించేలా ఉండాలి. ప్రపంచం మొత్తం తిరిగాను.. అన్ని జాతుల, మతాల, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్‌ ముక్క కోసం గ్యారేజ్‌లో పనిచేసే వాళ్లను చూశాను. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశాను. నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే ఇవన్నీ చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం’’

‘‘నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసింది ఈ ప్రదేశం. అణువణువు దైవత్వంతో నిండి ఉన్న ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది’’

పిల్లల విద్యకు సహాయం చేస్తాను

తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువయ్యేలా తపిస్తాను.. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలలు తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నాను. రాయలసీమలో ప్రారంభించే నా ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరు ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు.. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎన్నటికీ తీరదు. నా జీవితాన్ని ఈ నేల యువతకి అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నా రాగి సంగటి, మటన్‌ పులుసు సిద్ధంగా పెట్టండి..

మీ మంచు మనోజ్‌’

ఈ వ్యాఖ్యలతో మంచు మనోజ్ సినిమాల నుంచి తప్పుకుని  రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయితే మనోజ్‌కు ఇలాంటి మాటలు కొత్త కాదని, పబ్లిసిటీ కోసం అలా అంటుంటారనే వాదనలూ వినిపిస్తున్నాయి. అతడు  గతంలోనూ ఒకసారి ఇలాగే అన్నాడని, అయితే అభిమానుల కోరిక మేరకు మళ్లీ నటిస్తున్నానని చెప్పాడని గుర్తు చేస్తున్నారు.