Tollywood actor Sanjay Raichura joined BJP in the presence of etela Rajender
mictv telugu

ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన టాలీవుడ్ సినీ నటుడు

August 13, 2022

తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. అందుకు తగ్గట్లుగానే తన కార్యాచరణను అమలు చేస్తోంది. బీజేపీలోకి ఇతర నాయకులను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక వరంగల్ టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. రానున్న మరికొన్ని రోజుల్లో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

తాజాగా సినీ నటుడు సంజయ్ రాయిచుర బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈటల కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆచార్య, మహర్షి వంటి సినిమాల్లో నటించారు సంజయ్ రాయిచర. దీంతో పాటు పలు దక్షిణ భారత సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితమై బీజేపీలో చేరుతున్నానని సంజయ్ అన్నారు.