ఎవరు ఎంత సంపాదించినా చివరికి భూములపైనే పెట్టుబడులు పెడతారు. ఏ రంగం వారైనా రియల్ ఎస్టేట్ చేయటం సర్వసాధారణం. అలానే సినీ తారలు సైతం వారి డబ్బులతో భారీగా భూములను కొనుగోలు చేస్తుంటారు. శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున వంటి సినీ తారలు రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా సంపాదించారని అంటుంటారు. వీరి స్ఫూర్తితో ఇప్పుడు ఇండస్ట్రీలోని తారలంతా తమ సంపాదన మొత్తం భూములపైనే పెడుతున్నారని టాక్. ఈ నేపథ్యంలో తాజాగా సినీ తారలు హైదరాబాద్ లోని BNR హిల్స్ లో భారీగా ఆస్తులు కొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో స్థిరపడిపోయిన సినీ స్టార్స్ చూపు ఇప్పుడు గచ్చిబౌలి సమీపంలోని BNR హిల్స్ పై పడిందట.
జూబ్లీహిల్స్-అమీర్ పేట్- మణికొండ- పుప్పాల గూడ వంటి ఏరియాలు బిజీ స్పేస్ గా మారటంతో గచ్చిబౌళి నంది హిల్స్ కి సమీపంలో ఉన్న సువిశాలమైన BNR హిల్స్ లోని రియల్ వెంచర్లలో సినీ స్టార్స్ భారీగాపెట్టుబడులు పెడుతున్నారట. బిఎన్ఆర్ హిల్స్ నుంచి చూస్తే నగరంలో ప్రధానమైన గచ్చిబౌళి నంది హిల్స్.. భారీ లేక్ వ్యూ సహా ఇతర ఏరియాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అపార్ట్ మెంట్ల కొనుగోలు లాభదాయకమని సినీ సెలబ్రిటీలు భావిస్తుండడం చూస్తుంటే ఈ ఏరియా మరో బాంద్రా కాబోతోందా? అన్న సందేహాలు కలగక మానవు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరికి బాంద్రాలో భారీ నివాసాలు ఉన్నాయి. బాలీవుడ్ లోని మరికొందరు బడా స్టార్స్ అంతా ఇప్పుడు బాంద్రాకు షిఫ్ట్ అయిపోతున్నారు. దాంతో బాంద్రా అంటే బాలీవుడ్ మాదిరి తయారైంది. మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ అంటే BNR హిల్స్ అనే రోజులు వస్తాయంటూన్నారు విశ్లేషకులు.