కమెడియన్లకు మృత్యుగండం.. చిన్నవయసులోనే ఎందరో.. - MicTv.in - Telugu News
mictv telugu

కమెడియన్లకు మృత్యుగండం.. చిన్నవయసులోనే ఎందరో..

September 25, 2019

‘‘నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’’ అన్నారు హాస్యబ్రహ్మ జంధ్యాల. తెలుగు ప్రజలు హాస్యమంటే పడిచస్తారు. అసలు కొందరు మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. సామెతలు, సూక్తులు, దెప్పుళ్లు, ఘాటు, మోటు వెటకారాలతో తెలుగు హాస్యం చిందులేస్తుంటుంది. తెలుగు సినీప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటీనటులకు కొదవలేదు. కస్తూరి శివరావు,రేలంగి నుంచి వెన్నెల కిశోర్, సూర్యకాంతం నుంచి గీతాసింగ్ వరకు ఎందరో దిగ్గజాలు. ఈ రోజు వేణు మాధవ్ మరణం అభిమానులను, చిత్రసీమను కలచివేస్తోంది. ఆయన 50ఏళ్లు దాటకుండానే కన్నుమూయడం మరిత విషాదం. నటనతో ప్రేక్షకుల మనసు దోచుకునే కమెడియన్లకు మృత్యువుతో ఏదో అనుబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. యాదృచ్ఛికంగా పలువురు టాలీవుడ్ కమెడియన్లు చిన్నవయసులోనే చనిపోయారు. 

Tollywood comedians.

‘గుణసుందరి కథ’ చిత్రంలో జానపద చిత్రాలను మలుపు తిప్పిన నటుడు కస్తూరి శివరావు కూడా చిన్నవయసులోనే(52) ఏళ్లకే లోకం వీడారు. తాటిచెట్టుకు చక్కిలిగింత పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటారు మరో ప్రముఖ కమెడియన్ రమణారెడ్డి. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా.. ఏదైనా సరే నెల్లూరు మాండలికంలో దంచికొచ్చే ఆయన కూడా 53 ఏళ్లకే కన్నుమూశారు. కితకితల రాజబాబు కూడా చిన్నవయసులోనే చనిపోయారు. ఆయన ఈ భూమిపై తిరిగింది కేవలం 45 ఏళ్లే. హాస్యానికి పరాకాష్టగా మారి, వెక్కిళ్లు పట్టేలా నవ్వించిన సుత్తి వీరభద్రరావు జీవించింది కేవలం 41 ఏళ్లు మాత్రమే. ధర్మవరపు సుబ్రమణ్యం 53 ఏళ్లకే చనిపోగా, ఐరన్ లెగ్ శాస్త్రికూడా నాలుగో పడిలోనే కన్నుమూశారు. మొదట్లో కమెడియన్‌గా, తర్వాత హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించిన శ్రీహరి కూడా 50 దాటకుండానే లోకాన్ని వీడారు. వీరిలో చాలామంది జీవిత చరమాంకంలో ఆర్థిక కష్టాలు కూడా అనుభవించారు. పలువురు అనారోగ్యంతో బాధపడ్డారు.