Tollywood Director Madan Passed Away with Brain Stroke
mictv telugu

ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘పెళ్లైన కొత్తలో’ దర్శకుడు ఆకస్మిక మృతి

November 20, 2022

సినీ ఇండస్ట్రీని విషాదాలు వెన్నంటుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు మదన్ హఠాన్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.41గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మదన్‌ మరణ వార్తతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీతారలు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మదన్ అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. ‘ఆ నలుగురు’ సినిమాతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. పెళ్లయిన కొత్తలో సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఆ తర్వాత.. ‘‘గుండె ఝల్లుమంది’’, ‘‘ప్రవరాఖ్యుడు’’, ‘‘కాఫీ విత్ మై వైఫ్’’, ‘‘గరం’’, ‘‘గాయత్రి’’ తదితర సినిమాలను రూపొందించారు. తొలి సినిమా.. పెళ్లైన కొత్తలో మదన్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది. పెళ్లయిన తర్వాత ఆలుమగల మధ్య ఏర్పడే చిన్న చిన్న మనస్పర్థలు.. ఆ తర్వాత పరిణితితో, పెద్దవాళ్ల సలహాలతో వాటిని ఎలా పరిష్కరించకోవాలో తెలియజేసే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. జగపతిబాబు, ప్రియమణి, కోట శ్రీనివాసరావు ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలు.