ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో దుమ్ముదులిపిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ పేరు వింటేనే ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయి. దర్శకధీరుడు జక్కన్న తీర్చిదిద్దిన ఈ చారిత్రాత్మకమైన చిత్రంలోని పాట నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ పాటగా ఆస్కార్‌ను గెలుచుకుని తెలుగోడి సత్తాను వెలుగెత్తి చూపించింది. ఇటీవల చిత్ర యూనిట్ లాస్ ఏంజీల్స్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో పాల్గొని ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంది.
ఆస్కార్ అవార్డును అందుకోవడంతో చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ గుర్తింపు రావడంతో భారతీయులు విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. అయితే తాజాగా రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్ బస్టర్ రికార్డును సృష్టించిన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఎప్పుడంటూ రాజమౌళికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తాజాగా సీక్వెల్ ఉన్నట్లా లేనట్టా అనే ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌కు సంబంధించిన క్వశ్చన్ ఎదురైంది. ఆస్కార్ అవార్డు , ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ను వేగవంతంగా చేసేందుకు మోటివేషన్ ఇస్తుందా అని యాంకర్ ప్రశ్నించగా రాజమౌళి సమాధానంగా ” ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీం సభ్యుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఈ విజయం ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను వేగవంతం చేయడంలో దోహదపడుతుంది” అని సీక్వెల్ పై ఓ క్లారిటీని ఇచ్చారు రాజమౌళి. సీక్వెల్ ఉండబోతోందని గతంలోనే రాజమౌళి తెలిపారు. అప్పట్లోనే సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ సెకెండ్ పార్ట్ స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారు రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. కథ పూర్తైన వెంటనే సీక్వెల్‌ను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి సెకెండ్ పార్ట్ పట్టాలు ఎక్కేవరకు అభిమానులు వేచిచూడాల్సిందే.