బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు రాజమౌళి ఎన్నికల్లో సందడి చేయనున్నారు! ఏపీ వివాదాస్పద రాజధాని అమరావతికి డిజైన్ వంటి వ్యవహారాల్లో టీడీపీకి అనుకూలంగా ముద్రపడిన జక్కన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలాసార్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ట్రిపులార్ జోష్, ఆస్కార్ నామినేషన్ సాధించిన సందడిలో ఉన్న ఆయన ఇప్పట్లో రాజకీయాల్లో వచ్చే చాన్సు లేదు. మరి ఎన్నికల్లో ఎలా సందడి చేస్తారని అనుకుంటున్నారు కదూ..
పార్టీల గొడవల్లో తలదూర్చకుండా ఓటు హక్కు ప్రాధాన్యంపై ఆయన ప్రచారం చేయనున్నారు. దీని కోసం ఎన్నికల సంఘం ఆయనను సంప్రదించి ఒప్పించింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి రాజమౌళిని ఆ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు.
జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ ఈ విషయం వెల్లడించారు. రాజమౌళి బాగా తెలిసిన ఫేస్ కాబట్టి ఆయనతో ప్రచారం చేయిస్తే ఫలితం ఉంటుందని భావించామన్నారు. దర్శక దిగ్గజం అనే కారణంతోపాటు మరో కారణం వల్ల కూడా ఆయనను ఈసీ తన ప్రచారకర్తగా ఎంచుకుంది. రాజమౌళి పుట్టింది. ఆ జిల్లాలోనే. మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులో ఆయన జన్మించారు. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి 1973 అక్టోబర్ 10న విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోవ్వూరుకు చెందిన విజయేంద్ర ప్రసాద్ కుటుంబం రైల్వే లైన్ల నిర్మాణం వల్ల భూములు కోల్పోవడంతో కర్ణాటకకు వెళ్లి, రాయచూర్ జిల్లాలోని హీరేకోటిహాల్ గ్రామంలో భూములు కొని అక్కడే స్థిరపడింది. రాజమౌళి విద్యాభ్యాసం కొవ్వూరు, ఏలూరు, వైజాగ్‌లలో కొనసాగింది.